Tuesday, 20 June 2017

srirangam srinivasa rao ART BY lenin vskp



......Srirangam Srinivasa rao......


srirangam srinivasa rao ART BY lenin vskp


|| తెలుగు సాహిత్యంలో
మహా ప్రస్థానం చేసిన మహాకవి శ్రీశ్రీ ||
ఈ రోజు మహాకవి శ్రీశ్రీ వర్థంతి. 'ఏది రాసినా ఏం లాభం. వెనకటికి మహాకవి ఎవడో చెప్పే వుంటాడు..బహుశా ఆ చెప్పిన వాడెవడో నాకంటే బాగానే చెప్పుండొచ్చు'.. అని శ్రీశ్రీయే అన్నట్టు ఆయన కవిత్వ ఔన్నత్యాన్ని గురించి ఎన్నెన్నో విశేషాలు ఇప్పటికే చెప్పుకున్నవే.
కావాలని కవి అయినవాడో లేక రాజకీయ సందేశం కోసం కవితలు మొదలు పెట్టిన వాడో కాదు శ్రీశ్రీ. సంప్రదాయ కుటుంబంలో పుట్టి ప్రాచీన సాహిత్యం చదువుకుని వాటి పట్ల ఆకర్షితుడై ఆ విధమైన రచనలు కూడా చేసిన వ్యక్తి. ఆనాడు ప్రభావశీలంగా వున్న భావ కవిత్వాన్ని అప్పటికి దిగ్దంతులైన భావ కవితా పితామహుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి, పాషాణ పాక ప్రభువు అనిపించుకున్న సంప్రదాయ సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ఉభయుల నుంచి ప్రేరణ పొందిన వాడు. కృష్ణశాస్త్రి ప్రసంగం విని వూగిపోయి తిండీ తిప్పలూ లేకుండా తిరిగిన వాడు. అయితే ఉత్తరోత్తరా ఆ కృష్ణశాస్త్రిని కూడా తన మార్గానికి తీసుకు రావడమే గాక తననే అనుకరించేలా పాటలు రాయించడం శ్రీశ్రీ ప్రతిభాపాటవాలకు ఒక మచ్చుతునక.
శ్రీశ్రీ మొదటి కావ్యం 'ప్రభవ' 1928లో వెలువడింది. 'మానవ చరిత్రకే మహాభాష్య మనదగిన దేశచరిత్రలు' గీతం, 'మానవుడా మానవుడా' అంటూ మనిషి విశ్వజనీనతను చాటిన గీతం 1938లో రాశాడు. అంటే ఒక కవిగా శ్రీశ్రీ పరిణామ క్రమం 1928-38 మధ్య చాలా వరకూ జరిగింది.
1928 తర్వాత కచ్చితంగా అయిదేళ్లకు 1933లో పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీ దిశగా యువతను సమీకరించే కృషి జరుగుతున్నది. అదే ఏడాది శ్రీశ్రీ 'జయభేరి' రచించి 'నేను సైతం' అన్నాడు. 'భువన భవనపు బావుటానై పైకి లేస్తా'నని ప్రకటించాడు. మనిషి నిమిత్తమాత్రమనే భావనను పటాపంచలు చేసి వ్యక్తి సంకల్పాన్ని సార్థకతనూ చెప్పే సార్వకాలిక సందేశం ఆ గీతం. . 'ఆకలేసి కేకలేసినా ఎండా కాలం మండిపోయినా మనిషి నిలిచే వుంటాడు'.( లేదా వుంటుంది ) 'ఏ ఒక్కరి పాత్ర తక్కువది కాదు, ఆ ఒక్కరే లేకపోతే ప్రళయమే వస్తుం' దంటాడు. తర్వాత 'తెల్ల రేకై పల్లవించడం, విశ్వవీణకు తంత్రి కావడం, బావుటాగా పైకి లేవడం' తెలిసిందే! మరో ఆరు నెలలు గడిచాయి. 1934 ఫిబ్రవరి. ఆ సమయంలో ఆయనకు గంటలు వినిపించాయి. పట్టణాలలో పల్లెటూళ్లలో కర్మాగారంలో కార్యాలయంలో, ప్రాణము మోగే ప్రతిస్థలంలో గంటలు గంటలు! నిజానికి ఇవి ఆయనలో కదిలే నవ భావాల ధ్వనులు. ఇంతలోనే 'ఆకాశదీపం' రాశాడు.1934లో తొలి ఆంధ్ర కమ్యూనిస్టు కమిటీ ఏర్పడింది. ఆ ఏడాదే 'మహా ప్రస్థానం' గేయం వెలువడింది. 'జయభేరి'లో వ్యక్తి ప్రస్థానం చెప్పిన శ్రీశ్రీ 'మహాప్రస్థానం'లో సామూహికంగా 'పదండి ముందుకు' అంటూ ఆ వ్యక్తి ఆ సమూహంలో భాగంగా నడవడాన్ని చెప్పాడు. 'భువన భవనపు బావుటానై పైకి లేస్తా'నన్న శ్రీశ్రీ 'ఆ గేయం చివరలో ' ఎర్రబావుటా నిగనిగలు కనబడలేదా' అని ప్రశ్నించాడు. సామ్రాజ్యవాదుల పాలన దేశంలో భూస్వామ్య శక్తుల పాలక వర్గాల అణచివేత మధ్యన నవ యువకులు సమీకృతమవుతుంటే శ్రీశ్రీ 'నదీనదాలు అడవులు కొండలు ఎడారులా మనకడ్డంకి .. పదండి ముందుకు పదండి తోసుకు' అని పిలుపునిచ్చాడు. ఒక సమాజ పరిస్థితులలో రాజకీయ సిద్ధాంతాలతో పాటు భావ చైతన్య సృజనకు కూడా ఎలా బాట వేస్తాయో చెప్పే గొప్ప సందర్భమిది. 'మహాప్రస్థానం' రాసేనాటికి శ్రీశ్రీకి మార్క్సిజం తెలియ దన్నాడు. తర్వాత అయిదేళ్లు కూడా ఆయన జీవితం కోసం పెనుగులాడటం తప్ప ఉద్యమాలతో పెద్దగా కలసి నడిచిందేమీ లేదు. కాని ఆయన భావాలు పదునెక్కుతూ వచ్చాయంటే అది ఆయన పరిశీలనకూ ప్రతిభకూ మాత్రమే గాక పరిస్థితుల ప్రభావానికి కూడా నిదర్శనం. 1934 లోనే 'కాదేదీ కవితకనర్హమ'న్న 'రుక్కులు, 'పుడమి తల్లికి పురిటి నొప్పులు' అంటూ నూతన సృష్టిని చూపిన 'అవతారం' కూడా రాశాడు. 'పోనీ పోతే పోనీ అనుకున్నదే చేయాలం'టూ 'కళారవి' గీతం అందించాడు. తనను బాధపెడుతున్న 'బాటసారి'ని, 'బిక్షు వర్షీయనీ'ని కూడా ఈ ఏడాదే దర్శించాడు. వీటన్నిటి విశ్వరూపమైన తన కవితా జననిని అమోఘంగా దర్శిస్తూ 'కవితా కవితా' 1937లో రాశాడు. ఇది విని విశ్వనాథ కూడా లేచి ఆలింగనం చేసుకున్నాడట. తను చెప్పేది నిజం కాదని మెట్ట వేదాంతం చెప్పే మిథ్యావాదిని ఆక్షేపించే కవిత రాశారు. 'ఏవో ఏవేవో ఘోషలు వినిపిస్తున్నాయ'ంటూ 'అభ్యుదయం' దర్శించాడు. 'వ్యత్యాసం'లో 'ముందుకు పోతాం మేము. ప్రపంచం మా వెంట వస్తుంది' అని దృఢంగా ప్రకటించాడు. అప్పుడే అబ్బూరి రామకృష్ణారావు ఇచ్చిన లండన్‌ అభ్యుదయ రచయితల ప్రణాళిక చూసి 'సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు తన నవీన గీతికి నవీన రీతికి ప్రాణం ప్రణవం' అని చాటి చెప్పేసి మజిలీ చేరుకున్నాడు. అయినా ఒకింత సందేహంతో 'చేదుపాట' రాసి మళ్లీ 'నవకవిత' లో ఎగరేసిన ఎర్రని జెండాను తీసుకొచ్చాడు. మహాప్రస్థానంలో ఆ తర్వాత రాసిన గీతాలు మరో నాలుగైదు మాత్రమే వుంటాయి. 'జగన్నాథ రథచక్రాలు, కొంపెల్లకు అంకితం, సంధ్యా సమస్యలు, గర్జించు రష్యా, నిజంగానే'. వాటి విశేషాలు సాహితీ మిత్రులకు సుపరిచితమే.
మహాప్రస్థానంలోని ప్రతి గేయం, ప్రతి చరణం ఇప్పటికీ వర్తిస్తాయి. కొన్ని అచ్చంగా ఇప్పటి పరిస్థితులే రాసినట్టు వుంటాయి. ఎందుకంటే శ్రీశ్రీ కోరుకున్న సమధర్మం ఇంకా రాకపోగా ఆర్థిక అసమానతలూ వివక్షలు తీవ్రమవు తున్నాయి. 'పదండి ముందుకు పదండి తోసుకు' అంటూ సాగిపోవడమే దీనికి విరుగుడు. ఇక అక్షర ప్రియులు చేయవలసింది ఆయనలా చిరదీక్షా తపస్సమీక్షణ, నిరంతర అధ్యయనం, ప్రగాఢ పరిశీలనం, నిత్య క్రియాశీలత. క
మహాప్రస్థానంలోని ప్రతి గేయం, ప్రతి చరణం ఇప్పటికీ వర్తిస్తాయి. ఎందుకంటే శ్రీశ్రీ కోరుకున్న సమ ధర్మం ఇంకా రాకపోగా ఆర్థిక అసమానతలూ వివక్షలు తీవ్రమవు తున్నాయి. 'పదండి ముందుకు పదండి తోసుకు' అంటూ సాగిపోవడమే దీనికి విరుగుడు.
- తెలకపల్లి రవి






No comments:

Post a Comment

srirangam srinivasa rao ART BY lenin vskp

......Srirangam Srinivasa rao...... srirangam srinivasa rao ART BY lenin vskp || తెలుగు సాహిత్యంలో మహా ప్రస్థానం చేసిన మహాకవ...